బళ్లారి నగరంలోని ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్టీఓ) కార్యాలయంపై గురువారం లోకాయుక్త అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
కార్యాలయంలోని వివిధ విభాగాల్లో ఫైళ్లు, కీలక పత్రాలను అధికారులు పరిశీలించారు. బెంగళూరుకు చెందిన లోకాయుక్త డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలోని 15 మంది అధికారుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది.
పరిపాలనా వ్యవహారాలపై ఆరా
కార్యాలయ పరిపాలనా వ్యవహారాలు, పెండింగ్ ఫైళ్లు, అనుమానాస్పద పత్రాలను పరిశీలించి సిబ్బందిని విచారించినట్లు సమాచారం. ఉదయం నుంచి తనిఖీలు కొనసాగడంతో కార్యాలయంలో ఆందోళన నెలకొంది.
తనిఖీల్లో గుర్తించిన అంశాలు, స్వాధీనం చేసుకున్న పత్రాల వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఈ దాడులు రవాణా శాఖలో అవినీతిపై మరోసారి చర్చకు దారితీశాయి.











