కడియం, 16 November
తూర్పుగోదావరి జిల్లా మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. 10 గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో కూటమి పార్టీల మద్దతు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండగా, కొన్ని గ్రామాల్లో వైసీపీ అభ్యర్థుల కొరత కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో వైసీపీలో ఉత్సాహం తగ్గింది.
మండలంలో నామినేషన్ల సందడి మొదలైంది. గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. 10 గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో పోటీకి కూటమి పార్టీల మద్దతు అభ్యర్థులు క్యూ కడుతుంటే, కొన్ని గ్రామాల్లో వైసీపీ మద్దతు అభ్యర్థులు కొరవడ్డారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవడంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహం కొరవడింది. అందుకు తోడు, ఆ పార్టీ కోఆర్డినేటర్ సర్పంచ్ ఎన్నికలు తమకు అంత ముఖ్యం కాదని తేలికగా తీసుకోవడంతో ప్రోత్సహించేవారు లేక అభ్యర్థులు నీరసించిపోతున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు పరస్పర ఒప్పందాలతో ముందుకు వెళ్తున్నారు. ఐదు గ్రామ పంచాయతీలలో టీడీపీ, ఐదు గ్రామ పంచాయతీలలో జనసేన అభ్యర్థులు పోటీకి దిగుతుండగా, కడియపులంక గ్రామ పంచాయతీలో కూటమి నుండి ఇద్దరు జనసేన పార్టీ అభ్యర్థులు గట్టి నరసయ్య, గెడ్డం శివ రత్న గణపతి పోటీకి సిద్ధపడ్డారు. ఇప్పటికే గెడ్డం శివ నామినేషన్ వేశారు. గట్టి నరసయ్య రేపు నామినేషన్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీ అభ్యర్థి గట్టి నరసయ్యను బలపరుస్తూ మంత్రి కందుల దుర్గేష్ ఒక వీడియో విడుదల చేశారు. నరసయ్యకు, శివకు కూడా మద్దతు పలకాలని పిలుపునివ్వడం రాజకీయ చర్చకు దారితీసింది. దుళ్ళ గ్రామంలో కూటమి పార్టీ నుండి జనసేన నాయకులు సూరపురెడ్డి భరత్ సతీమణి చే భారీ జన సందోహం మధ్య కోలాహలంగా నామినేషన్ వేయించారు. మాజీ ఎంపీటీసీ తోకల వీర వెంకటరావు సతీమణి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. వీరవరం లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు దొంతంశెట్టి వీరభద్రయ్య ప్రకటించారు. కూటమి అభ్యర్థిగా న్యాయవాది ప్రభాస్ ముందుకు వస్తుండగా, జనసేనలో ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. దామిరెడ్డిపల్లి లో పాతూరి పాపారావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, శాటిలైట్ సూరిబాబు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. జనరల్ కు రిజర్వ్ అయిన కడియపుసావరం నుండి మాజీ సర్పంచ్ సాపిరెడ్డి సూరిబాబు పోటీ చేస్తుండగా, తాజా మాజీ సర్పంచ్ చెక్కపల్లి మురళి సతీమణి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాధవరాయుడుపాలెం బీసీ మహిళకు రిజర్వ్ కాగా, సానబోయిన ఉమారూప కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఖరారుపై ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు. జేగురుపాడు లో కూటమి పార్టీల సర్పంచ్ అభ్యర్థిగా కవల కుమారి రేపు నామినేషన్ వేయనున్నారు. వైసీపీ అభ్యర్థిగా మండల వైసీపీ అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ కుమార్తె కానీ, ఆయన కోడలు కానీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, మాజీ జెడ్పీటీసీ పాలపర్తి రోజా వర్గం నుండి బచ్చల సుభాషిణి చే ఆదివారం నామినేషన్ వేయించారు. వైసీపీ నాయకులు పాలపర్తి ప్రకాష్ కుమార్ మద్దతుతో ఈ నామినేషన్ పడడంతో, వైసీపీ రెబల్ అభ్యర్థిగా ఉన్నారా లేక ఇండిపెండెంట్గా బరిలో నిలుస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. నుండి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు సతీమణి గిరజాల రామకృష్ణ తులసి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా మాజీ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ రంగంలోకి దిగారు. పొట్టిలంకలో కూటమి అభ్యర్థిగా మట్ట వీరన్న పోటీలో ఉండగా, మంచాల సర్వేశ్వరరావు కూడా సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ఏకగ్రీవంగా తనకు సర్పంచ్ గా అంగీకరిస్తే 30 లక్షలు గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తానని సర్వేశ్వరరావు ప్రకటించారు. గ్రామంలో ఒక దశలో అంగీకారానికి రాగా, తాను నామినేషన్ వేస్తానని మరో అభ్యర్థి భీష్మించడంతో నామినేషన్ల తర్వాత ఆలోచిద్దాం అని సమావేశం వాయిదా వేశారు. ఇక పొట్టిలంకలో వైసీపీ అభ్యర్థి పోటీ ఊసే లేదు. ఇలా 10 గ్రామాల్లోనూ గ్రామ రాజకీయాలు వేడెక్కాయి.






