మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టింగ్ వీడియో కేసు ఇప్పుడు కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి కార్యాలయానికి సంబంధించిన వ్యక్తుల వరకు చేరింది. ఈ వీడియోను అప్లోడ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్ ఢిల్లీలోని కుమారస్వామి అధికారిక నివాసంలో ఒకరి చేతి నుంచి మరొకరికి చేరిందని పోలీసు కమిషనర్ వెల్లడించారు.
కర్ణాటక రాజకీయాల్లో మరో భారీ వివాదం తెరపైకి వచ్చింది. సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టింగ్ వీడియో కేసు ఇప్పుడు కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి కార్యాలయానికి సంబంధించిన వ్యక్తుల వరకు చేరింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్ ఢిల్లీలోని కుమారస్వామి అధికారిక నివాసంలో ఒకరి చేతి నుంచి మరొకరికి చేరిందని పోలీసు కమిషనర్ వెల్లడించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు మొబైల్ ఫోన్ లింక్
పోలీసుల వివరాల ప్రకారం, ఈ వీడియోను అప్లోడ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. అరెస్టయిన రితేశ్ పాండే ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, వినోద్ శర్మతో కలిసి కొనుగోలు చేసిన ఫోన్‌ను ప్రజ్వల్ ప్రసాద్‌కు కుమారస్వామి అధికారిక నివాసంలో అందజేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ వివరాలు నిందితుడి వాంగ్మూలంపై ఆధారపడి ఉన్నాయని, వాటిని సాంకేతిక ఆధారాలతో నిర్ధారించాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రజ్వల్ ప్రసాద్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
కుమారస్వామి కార్యాలయానికి చెందిన మీడియా కన్సల్టెంట్‌ను ప్రశ్నించిన పోలీసులు
కుమారస్వామి కార్యాలయంతో సంబంధం ఉన్నట్లు చెబుతున్న మీడియా కన్సల్టెంట్ ప్రజ్వల్ ప్రసాద్‌ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు విచారించారు. వీడియో ప్రచారంలో అతని పాత్ర ఏమిటి దాని వెనుక ఎవరున్నారు అనే కోణాల్లో ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరోవైపు మాజీ కాంగ్రెస్ నాయకురాలు కృపా అల్వా, టీవీ కెమెరామన్ ప్రశాంత్ కుమార్ సహా పలువురికి కోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ రక్షణ కల్పించింది.
ఫేక్ వీడియో అని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
సిద్ధరామయ్యపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్లు చూపించిన వీడియోలోని అంశాలు కల్పిత కథనంలో భాగమని బెంగళూరు పోలీసులు ప్రకటించారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు వీడియోలో చూపించినట్లుగా ఘటన జరిగినట్లు నిర్ధారించడం లేదని తెలిపారు. వీడియో అసలు ఎక్కడ రూపొందింది దాన్ని ఎవరు రికార్డు చేశారు దాదాపు 12 ఏళ్ల క్రితం జరిగినట్లు చెబుతున్న ఘటనను 2023లో ఎందుకు రికార్డు చేశారు అనంతరం 2026లో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు రికార్డింగ్‌కు ఉపయోగించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు.
కుమారస్వామి ఆరోపణలను ఖండించారు
తన నివాసం పేరును ఈ కేసులోకి లాగడంపై కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా అధికారులు తనను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ వ్యవహారంలో తన ప్రత్యక్ష ప్రమేయం నిర్ధారణ కాలేదని పోలీసులు కూడా స్పష్టం చేశారు. వీడియో వెనుక ఎవరి పాత్ర ఉంది రాజకీయ ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు చేసేందుకు దీన్ని రూపొందించారా లేక మరేదైనా కారణం ఉందా అన్నది దర్యాప్తు తేల్చాల్సి ఉంది. ఈ కేసు కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య రాజకీయ పోరును మరింత వేడెక్కిస్తోంది.










