బళ్లారి (గమ్యం ప్రజాస్వామ్యం వైపు) నవంబర్ 16
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువల పెంపు, సామాజిక సామరస్యం, జాతీయ ఐక్యత సాధనలో భగవద్గీత కీలక పాత్ర పోషిస్తుందని సోండా స్వర్ణవల్లి మహాసంస్థానానికి చెందిన శ్రీమద్ గంగాధరేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు.
శ్రీ భగవద్గీత అభియాన్ కర్ణాటక, శ్రీ సర్వజ్ఞేంద్ర సరస్వతి ప్రతిష్ఠాన్, శ్రీ సోండా స్వర్ణవల్లి మహాసంస్థాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం లోని సంగనకల్లు రోడ్డులో ఉన్న శ్రీ శంకర మఠంలో 2026 భగవద్గీత అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్వామీజీ భక్తులకు ఆశీర్వచనం అందించారు.
సుమారు 18 ఏళ్ల క్రితం జిల్లాలో తొలిసారిగా ప్రారంభమైన భగవద్గీత ప్రచార కార్యక్రమాన్ని, ప్రస్తుతం నూతన కార్యక్రమాలతో తిరిగి ప్రారంభించడం సంతోషకరమన్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాబోధన చేయడం ద్వారా యావత్ ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించారని తెలిపారు. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి మహనీయులు భగవద్గీత ప్రాముఖ్యతను చాటిచెప్పారని గుర్తుచేశారు.
ప్రస్తుత సమాజంలో మానసిక ఒత్తిడి, రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని, భగవద్గీత బోధనలు ప్రశాంతమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి దోహదపడతాయని వివరించారు. సమాజంలో తగ్గుతున్న నైతిక విలువలను పునరుద్ధరించడంతో పాటు వివిధ మతాలు, వర్గాల మధ్య పరస్పర అవగాహన, సామరస్యాన్ని పెంపొందించడం ఈ అభియాన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అభియాన్ కార్యకలాపాలు
ఈ అభియాన్లో భాగంగా ముఖ్యంగా చిన్నారులు, విద్యార్థులకు నిర్దిష్ట రాగం, పద్ధతిలో భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక అధ్యాయాన్ని ఎంపిక చేసి దాని సందేశాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ఏడాది రెండో అధ్యాయాన్ని ప్రత్యేకంగా బోధిస్తున్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా పాఠశాలలు, దేవాలయాలు, శంకర మఠాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు గీతా పఠన పోటీలు నిర్వహించడంతో పాటు లక్షలాది పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో నూతన భగవద్గీత అభియాన్ కమిటీని ఏర్పాటు చేసి, శంకర మఠం సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి విజయవంతం చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మోహన్ భట్, గురుపద హెగ్డే, శంకర మఠం ధర్మదర్శులు, నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


